ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుస రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా రాప్తాడు మండలం రాంనేపల్లి దగ్గర బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రిపేరులో ఉన్న ఓ లారీని తీసుకెళ్తున్న మరో లారీని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీని తరలిస్తున్న వాహనంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఇద్దరు క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స మృతి చెందారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల క్రిందట జిల్లా పరిధిలోని నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆ తర్వాత బుధవారం నాడు మరో ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.