దొంగతనాలకు సంబంధించిన సినిమాలు, టీవీ షోలు రావడం మూలానేమో.. దొంగలు కూడా తెలివి మీరి పోతున్నారు. ఎంతో పక్కాగా.. పగడ్బంధీగా ప్లాన్ చేసుకుని మరీ దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తులు నేపాల్ లోని గోల్డ్ షాపులో బంగారాన్ని కొట్టేశారు. అయితే బంగారాన్ని కొట్టేయడానికి పెద్ద ప్లాన్ నే వేయడం విశేషం. గోల్డ్ షాప్ లో గోల్డ్ ను కొట్టేయడానికి.. ఆ షాప్ కు ఆనుకునే కాస్మెటిక్స్ షాప్ పెట్టాడు. తీరా అవకాశం దొరకగానే ఆ గోల్డ్ షాప్ లోపలికి చొరబడి గోల్డ్ ను కొట్టేశారు.
నేపాల్‌లోని ఓ నగల దుకాణంలో రూ.4 కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించిన ముగ్గురు వ్యక్తులను లక్నోలో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారం, నగదు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేపాల్‌లోని భైర్వాలో ఉన్న నగల దుకాణంలో చోరీ చేసేందుకు నిందితులు దాని పక్కనే కాస్మెటిక్ దుకాణాన్ని తెరిచారు. చోరీకి ప్లాన్ చేసి, దుకాణంలోకి గ్యాస్ కట్టర్‌తో రంధ్రం చేసి రూ.4 కోట్ల విలువైన బంగారాన్ని అపహరించినట్లు సమాచారం. నిందితులను లక్నో గోమతి నగర్‌లో నివాసం ఉంటున్న మొహసిన్ అబ్దుల్లా, పేపర్ మిల్ కాలనీకి చెందిన మొహ్సిన్ అబ్దుల్లా, గోమతి నగర్‌లో నివాసం ఉంటున్న శారికలైగా గుర్తించారు. వీరు ఎంతో పక్కాగా ప్లానింగ్ చేసి దొంగతనం చేయడాన్ని తెలిసి అందరూ విస్తుపోయారు.