ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిండు ప్రాణాలు బలికావాల్సి వస్తుంది. ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శీతాకాలం కావడంతో వేడినీళ్లు కాచుకోవడానికి ఉపయోగించిన హీటర్ వారి పాలిట శాపమైంది. పొరపాటున హీటర్ కు చేయి తగలడంతో తల్లి, ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. హాలహర్వి మండలం గుళ్లెం గ్రామంలో సతీష్, కవిత(35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఈదంపతులకు నిశ్చల్ కుమార్ (11), వెంకటసాయి (8) ఇద్దరు సంతానం. ప్రతిరోజు స్నానానికి హీటర్ తో నీళ్లు కాచుకుంటారు. అలాగే శనివారం ఉదయం కూడా హీటర్ పెట్టారు. అయితే.. పొరపాటున హీటర్‌కు కవిత చేయి తగలడంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. తల్లికి ఏమైందో అనే కంగారుతో పిల్లలు ఆమెను పట్టుకోవడంతో వారికీ షాక్ తగిలింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
భార్య, ఇద్దరు పిల్లలు ఒకేసారి చనిపోవడంతో కవిత భర్త సతీష్ హతాశుడయ్యాడు. అతడు రోదించిన తీరు అక్కడున్న వారందరిని కలిచి వేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.