రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లోని ఒక ప్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో, ముగ్గురు పిల్లలతో సహా నలుగురు మరణించారు. జామ్వా రామ్‌గఢ్‌లోని టర్పెంటైన్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి, ముగ్గురు పిల్లలు చనిపోయినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. మరణించిన పిల్లల వయసు 2-5 సంవత్సరాల మధ్య ఉంది. నలుగురు కూడా మంటల్లో సజీవ దహనమయ్యారు.
మృతులను గరిమ (3) అంకుష్ (5), దివ్య (2)గా గుర్తించారు. సంఘటనా స్థలంలో ఉన్న ఫ్యాక్టరీ యజమాని శంకర్‌లాల్ మేనల్లుడు రమేష్ ఆర్య అలియాస్ కాలు (25) పిల్లలను రక్షించేందుకు లోపలికి వెళ్లి మంటల్లో చిక్కుకుని చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కాలిన గాయాలైన కొందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలను అదుపుచేసిన తర్వాత కాలిపోలిన మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడించారు. మంటలను అదుపు చేయడానికి చాలా సమయమే పట్టింది. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది కార్మికులు అక్కడే పని చేస్తున్నారు. కార్మికులతోపాటు వారి పిల్లలు కూడా అక్కడే ఉన్నారు.