బీహార్ రాష్ట్రంలోని బంకా లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మూడు సార్లు పెళ్లి చేసుకున్నాడు. అయితే కారణం ఏమిటంటే డబ్బు..! డబ్బు మీద పిచ్చి కారణంగా.. ఎక్కువ కట్నం కావాలనే దురాశతో ఒక వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సంజయ్ మండల్ అనే వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఘటన బంకాలోని భతుచక్ గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే సంజయ్ మండల్ మొదటి భార్య డైసీ దేవి ధన్‌కుండ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి తన భర్తపై కేసు పెట్టింది.
డైసీ దేవి తనకు సంజయ్‌తో వివాహమైందని పోలీసులకు చెప్పింది. పెళ్లయిన తర్వాత అంతా సవ్యంగానే సాగింది కానీ, కొన్ని నెలల తర్వాత నగలు, డబ్బు డిమాండ్ చేయడంతో పాటూ.. సంజయ్ ఆమెను వేధించడమే కాకుండా మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టాడు. తన అత్త కల్సియా దేవి కూడా తనను వేధించడం ప్రారంభించిందని మహిళ చెప్పింది. ఆ తర్వాత, సంజయ్ మండల్ ముంగేర్ జిల్లాలోని అర్గంజ్‌లో రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య వచ్చిన తర్వాత, ఆమె నన్ను ఇంటి నుండి వెళ్లగొట్టే చర్యలు ప్రారంభించిందని డైసీ వాపోయింది.
కొన్ని రోజుల తర్వాత రెండో భార్య కూడా ఏదో గొడవై పారిపోయిందని ఆ నేరస్థుడి మొదటి భార్య డైసీ తెలిపింది. ఆ తర్వాత సంజయ్ మూడో పెళ్లి చేసుకుని ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూనే ఉన్నాడు. సంజయ్ మండల్, శివరాత్రి రోజున ఎక్కువ కట్నం వస్తుందనే దురాశతో, ఒక పాప తల్లి అయిన రంజు దేవిని వివాహం చేసుకున్నాడు. రంజుదేవి ఆస్తి కూడా తీసుకుని ఆమెను గెంటేయాలని సంజయ్ కుటుంబం ప్రయత్నిస్తోందని డైసీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇప్పుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.