హర్యానాలోని సిర్సాలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి 25 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గూడ్స్ గోదాములో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకప్పుపైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా.. ఆ వ్యక్తి హైటెన్షన్ వైర్ పట్టుకున్నాడు. విద్యుదాఘాతంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని సివిల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
గూడ్సు రైలు ఎక్కుతున్న యువకుడిని చూసి అడ్డుకునే ప్రయత్నం కొందరు చేసినా కూడా అతడు వారి మాటలు వినలేదు. యువకుడి నుంచి ఆకాశ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించామని ఆర్పీఎఫ్ ఇన్‌ఛార్జ్ ఉషా నిరంకారీ తెలిపారు. గూడ్స్ రైలు పైకప్పుపై సెల్ఫీ తీసుకుంటుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందినట్లు తమకు సమాచారం అందిందని జీఆర్పీ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓం ప్రకాశ్ సైనీ తెలిపారు. మృతుడిని రాఘవ్ అగర్వాల్‌గా గుర్తించారు. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు.
కొన్ని రోజుల క్రితం, యుపిలోని గోరఖ్‌పూర్-నర్కతీయగంజ్ రైలు సెక్షన్‌లోని చితౌని-బహాన్ రైలు వంతెనపై సెల్ఫీ తీసుకుంటుండగా సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దేశవ్యాప్తంగా ఎంతో మంది యువత సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతున్నారు.