పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన 13 ఏళ్ల బాలిక మృతదేహాన్ని శనివారం జంగిపరా గ్రామంలోని ఓ చెరువులో దొరికింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. మైనర్‌పై అత్యాచారం చేసి హత్య చేశారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తూ, మిస్సింగ్ ఫిర్యాదును నమోదు చేసింది. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన మైనర్ బాలిక మృతదేహం కృష్ణపూర్ గ్రామంలోని తన ఇంటికి కిలోమీటరు దూరంలోని చెరువులో తేలుతూ కనిపించింది. బాధితురాలు తన తోబుట్టువులతో కలిసి దసరా రోజున బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
శనివారం ఉదయం చెరువులో మృతదేహం తేలుతున్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు గంటల తరబడి ఆ ప్రాంతాన్ని శోధించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం రావడంతో స్థానికులు నిరసనకు దిగారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ప్రియాంక తిబ్రేవాల్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం జంగిపారాకు చేరుకుంది. మీడియాతో మాట్లాడిన ప్రియాంక తిబ్రేవాల్.. "అమ్మాయి అదృశ్యమైనప్పుడు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పోలీసులు చెబుతున్నది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. విచారణ త్వరగా ముగించాలని భావిస్తూ ఉన్నారు" అని ఆరోపించారు. కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు బాలిక బతికే ఉండేదని, అత్యాచార ఘటనలను కప్పిపుచ్చేందుకే సీఎం మమతా బెనర్జీ చెప్పినట్లుగా పోలీసులు నడుచుకుంటున్నారని ప్రియాంక తిబ్రేవాల్ అన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయ సహాయం అందిస్తామని ప్రియాంక తిబ్రేవాల్ హామీ ఇచ్చారు.