నెత్తురోడిన తెలుగు రాష్ట్రాల రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది మృతి
Ten died in road accidents in AP and Telangana.తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు ఆదివారం నెత్తురోడాయి. వేర్వేరు
By తోట వంశీ కుమార్ Published on 22 May 2022 10:22 AM ISTతెలుగు రాష్ట్రాల్లోని రహదారులు ఆదివారం నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బొల్లికుంట వద్ద ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఒకరిని అల్లిపురానాకి చెందిన ఆటో డ్రైవర్ సింగారపు బబ్లుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హంటర్ రోడ్‌లోని ఫ్లైఓవర్‌పై వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు, ఖమ్మం నుంచి వరంగల్ వస్తున్న మరో కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ కారు ఫ్లై ఓవర్ నుంచి కిందపడిపోవడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా.. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ప్రభుత్వ ఉద్యోగి సారయ్య(42), ఆయన భార్య సుజాత(39)గా గుర్తించారు. మరో ఇద్దరు గాయాలతో చికిత్స పొందుతున్నారు.
వైఎస్సార్ కడప జిల్లా తాడిపత్రిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
మరో ఘటనలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద రహదారిపై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురుకికి గాయాలవ్వగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అదే విధంగా అన్నమయ్య జిల్లా సందేపల్లి మండలంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.