మాజీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన నక్సలైట్లు.. ఇద్దరు గార్డులను గొంతుకోసి హత్య..
Suspected Maoists target ex-BJP MLA. జార్ఖండ్ రాష్ట్రం మనోహర్‌పూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత గురుచరణ్ నాయక్‌పై
By Medi Samrat Published on 5 Jan 2022 2:19 PM GMT
జార్ఖండ్ రాష్ట్రం మనోహర్‌పూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత గురుచరణ్ నాయక్‌పై నక్సలైట్లు దాడి చేశారు. దాడిలో గురుచరణ్ క్షేమంగా బయటపడ్డారు. అయితే.. నక్సలైట్లు ఆయనకు భద్రతగా ఉన్న ఇద్దరు పోలీసుల గొంతు కోసి ఆయుధాలను దోచుకుని పారిపోయారు. భద్రతా సిబ్బంది ఇద్దరు మరణించగా.. అక్కడి నుంచి తప్పించుకుని సోనూవా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న గురుచరణ్ నాయక్ ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నివేదిక ప్రకారం.. గురుచరణ్ నాయక్ గోయిల్‌కెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్రువాన్ గ్రామంలో ఫుట్‌బాల్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వెళ్లాడు.
ఫుట్ బాల్ మ్యాచ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యేపై దాదాపు 15 నుంచి 20 మంది నక్సలైట్లు దాడి చేశారు. నక్సలైట్లు ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ప్రజల మధ్య తలదాచుకున్నారని చెప్పారు. గురుచరణ్ నాయక్‌పై గతంలో 2012లో కూడా దాడి జరిగింది. దాడి తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొని ఉంది. శాంతిభద్రతలు బలహీనంగా ఉన్నాయని హేమంత్ ప్రభుత్వాన్ని బీజేపీ ఇప్పటికే ప్రశ్నించింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిరసన తెలుపుతామని జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని బీజేపీ శాసనసభా పక్ష నేత బాబులాల్ మరాండీ సందర్శించనున్నారు. దాడికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీజేపీ జంగిల్ రాజ్ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసింది.