చెన్నైలోని ఒక రైల్వే స్టేషన్ దగ్గర రెండు ప్రత్యర్థి విద్యార్థి గ్యాంగ్‌ల మధ్య గొడవ జరిగింది. ఒక ముఠా రైలుపై రాళ్లు రువ్వడం ప్రారంభించింది. దీంతో ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. పచ్చయ్యప్ప కాలేజీకి, ప్రెసిడెన్సీ కాలేజీకి చెందిన విద్యార్థుల మధ్య గొడవ అనేక సందర్భాల్లో విధ్వంసానికి దారితీసింది. సోమవారం పెరంబూర్ రైల్వేస్టేషన్ సమీపంలో రెండు కళాశాలలకు చెందిన విద్యార్థులు మరోసారి ఘర్షణకు దిగారు. ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులు తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో, పచ్చయ్యప్ప కాలేజీ విద్యార్థులు అరక్కోణం వెళ్తున్న రైలులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
ప్రెసిడెన్సీ కాలేజీకి చెందిన విద్యార్థులు అతి దారుణంగా ప్రవర్తించారని ప్రయాణికులు తెలిపారు. ఆ తర్వాత పచ్చయ్యప్ప కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆరోక్కనం వైపు ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో రైలు డ్రైవర్ రైలును ఆపేశాడు. అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాళ్లదాడితో భయాందోళనకు గురైన కొందరు ప్రయాణికులు ఈ ఘటనను రికార్డు చేశారు. సెంబియం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా, 15 మంది ప్రెసిడెన్సీ కళాశాల విద్యార్థులను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు.