రాజస్థాన్ లోని కోటా అంటే విద్యార్థులకు సంబంధించిన ప్రాంతమని దేశం మొత్తానికి తెలుసు. ఎన్నో రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడకు వెళ్లి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎక్కడ చూసినా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, హాస్టల్స్ కనిపిస్తూ ఉంటాయి. కోటాలో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థి తన హాస్టల్ ఆరవ అంతస్తు నుండి పడి మరణించాడు. ఈ ఘటన జరగడంతో విద్యార్థులు హాస్టల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన క్షణాలు హాస్టల్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దీనిపై జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. స్నేహితులతో మాట్లాడుకుంటూ వచ్చిన విద్యార్థి ఆరో అంతస్థు నుండి కిటికీలో నుండి కిందకు పడిపోయాడు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల నీట్ విద్యార్థి తన హాస్టల్ భవనంలోని ఆరవ అంతస్తు నుండి పడి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో హాస్టల్‌లో అమర్చిన సీసీటీవీ లో రికార్డు అయింది. మృతుడు తన ముగ్గురు హాస్టల్ మేట్స్‌తో కలిసి భవనం ఆరవ అంతస్తులోని బాల్కనీలో మాట్లాడుతున్నట్లు వీడియో చూపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో, వారు తమ గదులకు తిరిగి వెళుతుండగా, భట్టాచార్య బ్యాలెన్స్ తప్పి పడిపోయినట్లు భావిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
మరో సంఘటనలో, 17 ఏళ్ల జేఈఈ మెయిన్ ఆశావహుడైన విద్యార్థి.. తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్‌లోని కోటాలో బాలుడు తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు అతని గదిలో నుండి ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు.