ఆస్తి వివాదం కారణంగా ఆగిన అంత్యక్రియలు
భూవివాదం కారణంగా ఓ తండ్రి అంత్యక్రియలు కాస్తా ఆలస్యం అయ్యాయి.
By Medi Samrat Published on 13 Feb 2025 6:30 AM IST
భూవివాదం కారణంగా ఓ తండ్రి అంత్యక్రియలు కాస్తా ఆలస్యం అయ్యాయి. వరంగల్ జిల్లా ఏడునూతుల గ్రామంలో తండ్రి అంత్యక్రియలు దాదాపుగా నిలిచిపోయాయి. 65 ఏళ్ల వెలికట్టె యాదగిరి మృతదేహం మూడు రోజుల పాటు అతని ఇంటి ముందే ఉండిపోయింది.
వెలికట్టె యాదగిరి (55)కి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు కొడుకు రమేశ్ ఉండగా.. రెండో భార్య పద్మకు కొడుకు ఉపేందర్, కూతురు శోభారాణి పుట్టారు. అయితే పద్మ కొడుకు ఉపేందర్ అనారోగ్యంతో గతంలోనే చనిపోయాడు. యాదగిరికి గ్రామంలో 15 ఎకరాల భూమి ఉండగా ఐదు ఎకరాలను రమేశ్ పేరున రిజిస్ట్రేషన్ చేసి, రెండు ఎకరాలను కట్నం కింద కూతురు శోభారాణి రాసి ఇచ్చి, మరో మూడు ఎకరాలు అమ్మి బంగారం పెట్టారు. మిగతా ఐదు ఎకరాలను రెండో భార్య పద్మ పేరిట రాశారు. అయితే పద్మ తన పేరున ఉన్న భూమిలో మూడు ఎకరాలను అమ్మి తన కూతురు శోభకు హైదరాబాద్‌లో ఇల్లు కొనిచ్చింది. యాదగిరి అనారోగ్యంతో ఈ నెల 10న చనిపోయాడు.
దీంతో తన చిన్నమ్మ పద్మ పేరున ఉన్న మిగిలిన రెండు ఎకరాల విషయం తేల్చిన తర్వాత తండ్రికి అంత్యక్రియలు చేస్తానని కొడుకు రమేశ్ పట్టుబట్టాడు. గ్రామస్తులు సైతం రమేశ్‌కే మద్దతు పలకడంతో మూడు రోజులుగా యాదగిరి డెడ్‌బాడీ ఇంటి ముందే ఉంది. చివరకు గ్రామస్తులు బుధవారం పద్మ, శోభతో మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. దీంతో గురువారం యాదగిరి అంత్యక్రియలు నిర్వహించారు. వివాదాన్ని పక్కనబెట్టి తండ్రిని గౌరవించాలని స్థానిక పెద్దలు, కుటుంబ సభ్యులు రమేష్‌ను వేడుకున్నా.. వినలేదు. ఉద్రిక్తతలు పెరగడం, స్థానికులు జోక్యం చేసుకోవాలని కోరడంతో, పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు.