మహారాష్ట్రలోని దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేశాడు కొడుకు. కత్తితో పొడిచి, కర్రతో కొట్టి దారుణంగా హింసించి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. సచిన్ కుల్తే అనే 31 ఏళ్ల వ్యక్తి మద్యానికి అడిక్ట్ అయ్యాడు. దీంతో అతడిని తన భార్య వదిలేసింది. భర్తకు దూరంగా తన పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోని సచిన్ కుల్తే తన తల్లితో కలిసి ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల కిందటే సచిన్ కుల్తే తండ్రి మరణించాడు. దీంతో తల్లి విమల్ దత్తోపంత్ కుల్త (60)కు కొంత ఆస్తి, పొలం వచ్చింది. ఉన్న ఆస్తిని మొత్తం తాగుడు కోసమే ఖర్చు చేశాడు. ఆస్తి మొత్తం ఖర్చు పెట్టాక ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ తల్లిని హింసకు గురి చేశాడు.
ఈ క్రమంలో సచిన్ కుల్తే డబ్బులు అడిగితే తల్లి విమల్ దత్తోపంత్ ఇవ్వలేదు. దీంతో కోపం తెచ్చుకున్న అతడు తల్లిపై దాడికి పాల్పడ్డాడు. కిచెన్ రూమ్‌లోని కత్తితో తల్లిని పొడిచాడు. కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిని చంపిన తర్వాత నిందితుడు సచిన్ నేరుగా తన సోదరి ఇంటికి వెళ్లాడు. జరిగిన విషయాన్ని చెప్పి.. ఎవరికీ కూడా తల్లిని చంపిన విషయం చెప్పొదన్నాడు. ఇంటికి వచ్చిన సోదరి.. తన తల్లిని చూసి బోరున విలపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.