లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. అత్తగారి ఇంటికి వెళ్లిన అల్లుడు.. వారి ఆహారంలో విషం కలపడంతో ఆ విషాహారం తిన్న అతని భార్య చనిపోయింది. అతని కూతురు, కోడలు, అత్తయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరకట్నం కోసం వేధించడంతో అతని భార్య భర్తను వదిలి పిల్లలతో కలిసి తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ ఆహారంలో విషం కలపడం వెలుగులోకి వచ్చిందని.. భర్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఇటావా ఎస్‌ఎస్పీ తెలిపారు.
ఇటావా జిల్లా సైఫాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా సుభాన్ గ్రామానికి చెందిన సరితకు ఫిరోజాబాద్‌కు చెందిన ప్రమోద్‌తో 2015లో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే ప్రమోద్ సరితను వరకట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో 10 నెలల క్రితం సరితను కుటుంబ సభ్యులు సైఫాయిలోని సొంత ఇంటికి తీసుకొచ్చారు. ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అత్తమామల వద్దకు వచ్చిన ప్రమోద్.. పిండి, పాలు, అన్నం, పెరుగు తదితర ఆహార పదార్థాల్లో విషం కలిపాడు. వాటిని తిన్న కుటుంబ సభ్యుల్లో భార్య సరిత ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె, మరదలు, అతని అత్తయ్యను సైఫాయి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. నిందితుడు ప్రమోద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఎస్పీ తెలిపారు. అన్ని ఆహార పదార్థాలకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు సిద్ధం చేస్తున్నామని, చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.