వేధిస్తున్నాడని బావ తలపై.. రొట్టె పెనంతో అక్కా తమ్ముడి దాడి.. రాత్రి మొత్తం అలాగే ఉంచి

Sister, brother who attacked older sister's husband. హైదరాబాద్‌ నగర పరిధిలో మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

By అంజి  Published on  7 Dec 2021 3:20 AM GMT
వేధిస్తున్నాడని బావ తలపై.. రొట్టె పెనంతో అక్కా తమ్ముడి దాడి.. రాత్రి మొత్తం అలాగే ఉంచి

హైదరాబాద్‌ నగర పరిధిలో మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో బావ ఇంటికి వచ్చి రోజు వేధిస్తున్నాడని అక్కా తమ్ముడు కలిసి దాడి చేశారు. తలపై గట్టిగా కొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. రాత్రి మొత్తం బావను అలాగే ఉంచి తెల్లవారిన తరువాత ఆస్పత్రికి తీసుకెళ్లారు. చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూలు జిల్లా వెదిలిపతగుట్ట తండాకు చెందిన సాంబావత్‌ సరోజ (30), మిడ్జిల్‌ మండలం వేములకు చెందిన జరుప్లావత్‌ శ్రీను (21) అక్కా తమ్ముళ్లు. సరోజ భర్త చనిపోయాడు. ఆమె అప్పటి నుండి తమ్ముడితో పాటు టైల్స్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వీరిద్దరూ మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో జిల్లెలగూడ సత్యసాయినగర్‌ కాలనీలో ఉంటున్నారు.

వీరికి అక్క లక్ష్మీ ఉంది. లక్ష్మీకి ఉప్పుగూడ వినాయక్‌నగర్‌కు చెందిన కొడావత్‌ రెడ్యాతో (45) పెళ్లి జరిగింది. టైల్స్‌ పని చేసే రెడ్యా.. నిత్యం మద్యం తాగి జిల్లెలగూడలో ఉంటున్న సరోజ ఇంటికి వెళ్లేవాడు. ఆమెతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో రెడ్యా తాగి సరోజ ఇంటికి వెళ్లి వాగ్వాదడానికి దిగాడు. దీంతో వారు అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఉన్న రొట్టె పెనంతో బావ తలపై గట్టిగా కొట్టారు. దీంతో అతడికి తీవ్ర గాయాలై అధిక రక్తస్రావం అయ్యింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని ఆ రాత్రి అంతా అలాగే ఉంచారు. ఆ తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడి నుండి అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రెడ్యా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు అక్కాతమ్ముడిని రిమాండ్‌కు తరలించారు.

Next Story
Share it