మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జబల్పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్ నుండి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న మినీ బస్సు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారని ఒక అధికారి తెలిపారు. జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 65 కి.మీ దూరంలో ఉన్న సిహోరా పట్టణానికి సమీపంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా పిటిఐకి తెలిపారు. ట్రక్కు, మినీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారని ఆయన చెప్పారు.
ట్రక్కు హైవేపై తప్పుడు వైపు నుంచి వెళుతుండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు మినీ బస్సులోనే చిక్కుకున్నారని వారు తెలిపారు. మరికొందరికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత, కలెక్టర్, జబల్పూర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రమాద స్థలానికి బయలుదేరారు. ప్రమాదానికి గురైన మినీ బస్సు నంబర్ AP29W1525. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.