హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం లంగర్ హౌజ్ ప్రాంతంలో స్కూల్ టీచర్‌ను ఆమె భర్త హత్య చేశాడు. హషమ్‌నగర్ లంగర్ హౌజ్ నివాసి కరీం బేగం, మహ్మద్ యూసుఫ్ ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
గత ఏడాది నుండి, దంపతులు విడివిడిగా ఉంటున్నారు. కరీమా బేగం తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. కరీమా బేగం నడకదారిన పాఠశాలకు వెళ్తుండగా యూసుఫ్ ఇనుప రాడ్ తీసుకుని వచ్చి ఆమె తలపై కొట్టాడు. ఆమె స్పృహతప్పి పడిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో మరణించిందని లంగర్ హౌజ్ పోలీసు అధికారి కె శ్రీనివాస్ తెలిపారు.
కంట్రోల్ రూం నుండి సమాచారం అందుకున్న లంగర్ హౌజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. పోలీసులు యూసుఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగానే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.