గ్రామ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన సర్పంచే నీచానికి దిగజారాడు. గ్రామంలోని అమ్మాయిలపై కన్నేసి.. వారిని వేధింపులకు గురి చేశాడు. సర్పంచ్ ఆగడాలు తట్టుకోలేకపోయిన ఓ యువతి.. అతని ఇంటి ముందు నిరసనకు దిగింది. దీంతో ఆ సర్పంచ్‌కు కోపం వచ్చిందో ఏమో.. ఏకంగా యువతి ముక్కును కోసేశాడు. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. సుపాల్ జిల్లాలోని సదర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల లోధ్ గ్రామ సర్పంచ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు యువతులు సర్పంచ్ తమను వేధిస్తున్నాడని ఆరోపించారు. బాలికల్లో ఒకరు నిరసన వ్యక్తం చేయడంతో, అతను పదునైన ఆయుధంతో ఆమె ముక్కును కోసాడు. గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు సర్పంచ్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు, తనపై, తన మద్దతుదారులపై బాలికల కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపిస్తూ సర్పంచ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.