ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ట్రిపుల్ తలాక్ ఉదంతం వెలుగు చూసింది. భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన కేసులో నిందితుడిని ఠాణా ఎత్మదౌలా పోలీసులు అరెస్ట్ చేశారు. సౌదీ అరేబియాకు పారిపోయేందుకు సిద్ధపడినట్లు పోలీసులు తెలిపారు. ఆగ్రా పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఎత్మదౌలా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యదేవ్ శర్మ మాట్లాడుతూ "సల్మాన్ ఖాన్ పై వేధింపుల కేసు ఉంది. భార్యను సరిగా చూసుకోకపోవడమే కాకుండా.. అత్తమామలు కట్నం డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితురాలు అఫ్సానా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు" అని తెలిపారు.
భర్త సల్మాన్ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడని అఫ్సానా ఫిర్యాదులో పేర్కొంది. ఇంటికి వచ్చి రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని.. ఇంతలో ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఫిర్యాదులో తెలిపింది. భర్త సల్మాన్ ఖాన్ అలియాస్ ఇక్రార్ ఖాన్ అలీఘర్‌లోని బన్నాదేవి ప్రాంతంలో నివాసముంటున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆగ్రా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. శనివారం (ఏప్రిల్ 9, 2022), నిందితుడు సల్మాన్ ఖాన్ అలియాస్ ఇక్రార్‌ను అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. నిందితుడి భార్య అఫ్సానాను కూడా పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించినట్లు సమాచారం. కేసు దర్యాప్తు అనంతరం ఆరోపణ నిజమని తేలితే నిందితుడు సల్మాన్‌పై సంబంధిత సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని ఆగ్రా పోలీసులు మహిళకు హామీ ఇచ్చారు.