ప‌క్కాగా ప్లాన్ చేసి న‌కిలీ క్రికెట్ లీగ్‌.. అనుకోకుండా ప‌ట్టుబ‌డ్డారు..!

Russian punters duped by fake cricket league in Gujarat village. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లోని ఒక చిన్న గ్రామంలో రష్యాకు చెందిన వ్యక్తులను

By Medi Samrat  Published on  11 July 2022 6:29 PM IST
ప‌క్కాగా ప్లాన్ చేసి న‌కిలీ క్రికెట్ లీగ్‌.. అనుకోకుండా ప‌ట్టుబ‌డ్డారు..!

గుజరాత్‌లోని వాద్‌నగర్‌లోని ఒక చిన్న గ్రామంలో రష్యాకు చెందిన వ్యక్తులను మభ్యపెట్టే లక్ష్యంతో నకిలీ క్రికెట్ లీగ్ నడుపుతున్న నలుగురిని అరెస్టు చేశారు. రష్యాకు చెందిన వ్యక్తులను మోసం చేయడానికి నిందితులు ఏర్పాట్లను చేసుకున్నారని గుర్తించారు. దాదాపు నిజమైన మ్యాచ్‌ల తరహాలో అంతా పక్కాగా ప్లాన్ చేసారు. హర్షా భోగ్లే రేంజిలో కామెంట్రీ ఇచ్చే వ్యాఖ్యాతను కూడా తమ టీమ్ లో జాయిన్ చేశారు. యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ.. మూడు రష్యన్ నగరాలైన ట్వెర్, వొరోనెజ్, మాస్కోలలో బెట్టింగ్ లు ఏర్పాటు చేశారు. దాదాపుగా నకిలీ లీగ్‌లో క్వార్టర్-ఫైనల్‌కు చేరుకున్నారు, కానీ వారు సెమీ-ఫైనల్‌కు చేరుకోకముందే పోలీసులకు పట్టుబడ్డారు.

వాద్‌నగర్‌లోని మోలిపూర్ గ్రామంలో, నిందితులు మొదట పొలాన్ని కొనుగోలు చేశారు. పొలాన్ని చదును చేసి క్రికెట్ మైదానంలా తీర్చిదిద్దారు. పిచ్ తయారు చేశారు. లీగ్ మ్యాచ్ ల తరహాలో హాలోజన్ లైట్ సెటప్ చేయబడింది. మ్యాచ్ వ్యాఖ్యానం, ప్రత్యక్ష ప్రసారం కోసం.. సెటప్ కూడా ఏర్పాటు చేశారు. నిందితులు గ్రామస్తులను కిరాయికి తీసుకుని మ్యాచ్ లు ఆడించారు. కూలీలు, యువకులను కలుపుకుని నకిలీ టీమ్ లను సృష్టించారు.

స్థానిక పోలీసుల ప్రకారం.. లీగ్ ప్రత్యేకంగా బెట్టింగ్ కోసం నిర్వహించబడింది. ప్రత్యేకంగా రష్యన్ మార్కెట్‌ను టార్గెట్ చేశారు. ఇంటర్నెట్ నుండి డౌన్‌లోడ్ చేయబడిన క్రౌడ్-నాయిస్ సౌండ్ ఎఫెక్ట్‌లు కూడా రష్యాలో కూర్చున్న వారికి చూపించారు. టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా బెట్టింగ్‌లు జరిగాయి. ఏకంగా లీగ్ నే పెద్ద మొత్తంలో అమ్మేయాలని అనుకున్నారు. కానీ మెహసానా పోలీసులు నిర్వాహకుల ప్లాన్ ను నాశనం చేశారు. ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. రష్యా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సూత్రధారి ఆసిఫ్‌ మహ్మద్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.








Next Story