రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని చార్భుజ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొలంలో 45 ఏళ్ల మహిళ మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె కాలును కోసి ఉండడాన్ని కూడా గుర్తించారు. ఘటన సమయంలో మహిళ ధరించిన వెండి గజ్జెలను దొంగిలించేందుకు దుండగులు ఆమె పాదాలను నరికి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. నిందితులు మహిళ మెడపై దాడి చేయడంతో ఆమె మృతి చెందిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతి చెందిన మహిళను కంకుబాయిగా గుర్తించారు. సోమవారం ఉదయం భర్తకు భోజనం పెట్టేందుకు కంకుబాయి ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో ఈ హత్య జరిగింది.
కంకుబాయి తన భర్త పనిచేస్తున్న పొలానికి చేరుకోడానికి ముందే ఆమెను హత్య చేశారు. కంకుబాయి భర్త ఇంటికి తిరిగి వచ్చి.. పిల్లలను మీ అమ్మ ఎక్కడ..? అని అడిగాడు. కంకుబాయి ఉదయాన్నే పొలానికి ఆహారం తీసుకుని వెళ్లిందని పిల్లలు చెప్పారు. కంకుబాయి బంధువులు, స్థానికులు రాత్రి వరకు వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో చరభుజ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ రిపోర్టు నమోదైంది. హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. అతడి నుండి మరింత సమాచారాన్ని తెలుసుకుంటున్నామని రాజ్‌సమంద్ ఎస్పీ శివలాల్ తెలిపారు.