గురువారం అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో 50 ఏళ్ల వ్యక్తి, ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడనే అభియోగాలు నమోదయ్యాయి. ఆ వ్యక్తి పోలీసు కస్టడీ నుండి పారిపోయేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులు కాల్పులు జరిపారు. బాలికల కుటుంబ సభ్యులు అతనిపై ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత బుధవారం అతన్ని అరెస్టు చేశారు. స్థానిక పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు బాలికలపై అనేక సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులు అందాయి. ఆదివారం కూడా అతడు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది.
నిందితుడిని విచారించగా, నాలుగో బాలికపై కూడా అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. నాల్గవ అమ్మాయి దుస్తులను తన నివాసంలో ఉంచినట్లు అతను పోలీసులకు తెలిపాడు. పోలీసులు, సాక్ష్యాలను సేకరించే ప్రయత్నంలో.. నిందితుడిని గురువారం తెల్లవారుజామున అతని నివాసానికి తీసుకువెళుతుండగా, అతను కస్టడీకి పారిపోయేందుకు ప్రయత్నించాడని అధికారి తెలిపారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడి కాలులోకి తూటా వెళ్ళింది. ప్రస్తుతం నిందితుడు గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అధికారి తెలిపారు.