రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన స్నేహాన్ని నిరాకరించిందన్న కోపంతో 17 ఏళ్ల బాలికపై బ్లేడ్‌తో దాడి చేశాడు. బాలిక కోసం పాఠశాల ఆవరణలో ఎదురూ చూసిన బాలుడు.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం నాడు చోటుచేసుకుంది. విరామ సమయంలో, తన తరగతిలో ఒంటరిగా కూర్చున్న బాలికను గుర్తించిన అతను తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో ఆమెపై దాడి చేసి, వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. బాధితురాలి ఆర్తనాదాలు విన్న ఉపాధ్యాయులు, సిబ్బంది రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను కాపాడారు.

ఓ జాతీయ దినపత్రిక కథనం ప్రకారం.. నిందితుడు 12వ తరగతి చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి అని తెలిసింది. అతను చాలా రోజులుగా బాలికను వెంబడిస్తున్నాడు. అమ్మాయిని స్నేహాం చేయాలంటూ నిందితుడు కోరగా.. దానికి ఆమె తిరస్కరించడంతో కోపం తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు.

ఇదిలా ఉండగా, 11వ తరగతి చదువుతున్న బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని మార్వాడ్ జంక్షన్ ఎస్‌హెచ్‌వో మోహన్ సింగ్ తెలిపారు. అయితే ఆమె సరిగా మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయలేకపోతున్నారు. మరోవైపు, పోలీసులు నిందితుడిని చుట్టుముట్టారు. తదుపరి విచారణ కోసం అతని వయస్సును ధృవీకరించడానికి అతని పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం బాధితురాలి తండ్రి వాంగ్మూలాలను కూడా నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story