రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ హైవేపై సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాలు చాలా బలంగా ఢీకొనడంతో ట్రక్కు క్యాబిన్‌కు మంటలు అంటుకుని డ్రైవర్-క్లీనర్ పూర్తిగా కాలిపోయారు. ఈ ప్రమాదం కారణంగా హైవే మొత్తం జామ్ అయింది. ఫ్లైఓవర్ నుంచి కిందకు వస్తుండగా ట్యాంకర్.. ఇటుకలతో కూడిన ట్రక్కు, ట్రాలీ ఒకదానికొకటి ఢీకొన్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
లారీకి మంటలు అంటుకోవడంతో క్యాబిన్‌లో కూర్చున్న డ్రైవర్, క్లీనర్ తప్పించుకోలేక సజీవదహనమయ్యారు. తీవ్రమైన మంటల కారణంగా.. ప్రజలు ట్రక్కు దగ్గరకు వెళ్లలేకపోయారు.. ఇద్దరూ సహాయం కోసం కేకలు వేస్తూనే ఉన్నారు. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు ఎగసిపడటంతో చాలాసేపటి వరకూ మృతదేహాలను బయటకు తీయలేకపోయారు.
అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఇతర ట్యాంకర్, ట్రాలీ డ్రైవర్లు కూడా గాయపడగా వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఎస్‌హెచ్‌ఓ హరిశ్చంద్ర సోలంకి తెలిపారు. ట్రక్కు క్యాబిన్ దగ్ధమైందని.. అందులో ఉన్న డాక్యుమెంట్లు కూడా కాలిపోయాయని చెప్పారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ట్రక్ నంబర్ ఆధారంగా బాధితులను గుర్తించేందుకు ఆర్టీఓ కార్యాలయానికి వివరాలు పంపినట్లు తెలిపారు.