కర్నాటక హాసన్ జిల్లాలో ఓ ఆలయ పూజారి తలపై కర్రతో కొట్టి తలనొప్పిని నయం చేసేందుకు ప్రయత్నించి మహిళను హతమార్చాడు. కాగా ఆలయ పూజారి కోసం కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 302 (హత్య) కింద ఆలయ పూజారి మను (42)పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది. పార్వతి (37) అనే మహిళ రెండు నెలలుగా తలనొప్పితో బాధపడుతోందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. బెంగుళూరులోని అనేక ఆసుపత్రులను వెళ్లినప్పటికీ, ఆమెకు సరైన చికిత్స జరగలేదు.
ఆమెకు ఎటువంటి అనారోగ్యం లేదని వైద్యులు చెప్పారు. వివరాల ప్రకారం.. పార్వతి బంధువు మంజుల ఆమెను జిల్లాలోని బెక్క గ్రామానికి రావాలని కోరింది. డిసెంబరు 2న గ్రామంలోని పిరియపట్టాలదమ్మ ఆలయంలో పూజారి మను అనే వ్యక్తిని పార్వతి కలిశారు. పూజారి ఆమెను డిసెంబర్ 7న తిరిగి రమ్మని అడిగాడు. పార్వతి మరికొందరు గ్రామస్థులతో కలిసి మను వద్దకు వెళ్ళినప్పుడు, అతను ఆమెను 'చికిత్స'లో భాగంగా బెత్తంతో కొట్టడం ప్రారంభించాడు. ఫిర్యాదు మేరకు.. గాయపడిన పార్వతి ఆలయంలో కుప్పకూలింది. స్పృహ కోల్పోయింది.
ఆమెను చన్నరాయపట్టణ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పెద్ద ఆసుపత్రికి తరలించాలని వైద్యులు కోరారు. ఆ తర్వాత ఆమెను హసన్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ డిసెంబర్ 8న తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించింది. పోస్టుమార్టం రిపోర్టులో లేదు కానీ గాయాల కారణంగానే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు.