బీజేపీ నేత ఇంట్లో తుపాకీ పేలిన శబ్దాలు.. తీరా చూస్తే..
People were in awe when they heard the sound of bullets from BJP leader. జూన్ 16న, బీహార్‌లోని ముంగర్‌లో, బీజేపీ నాయకుడు అరుణ్ యాదవ్
By Medi Samrat Published on 18 Jun 2022 8:00 PM IST
జూన్ 16న, బీహార్‌లోని ముంగర్‌లో, బీజేపీ నాయకుడు అరుణ్ యాదవ్ తన భార్యను కాల్చి చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అరుణ్ యాదవ్ భార్య ప్రీతి కుమారి తాను అలసిపోయానని, విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో ఆగ్రహించిన బీజేపీ నేత అరుణ్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ దర్వాజా ప్రాంతంలో జరిగింది. జూన్ 16న బడా బాబుగా పేరుగాంచిన బీజేపీ నేత అరుణ్ యాదవ్ ఇంటి నుంచి భారీ శబ్దాలు రావడంతో జనం ఉలిక్కిపడ్డారు. బుల్లెట్ల శబ్ధం విని జనం ఆయన ఇంటికి చేరుకునే సరికి బెడ్‌రూమ్ లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఆ తర్వాత కిటికీలోంచి చూడగా భార్యాభర్తల మృతదేహాలు పడి ఉన్నాయి. అరుణ్ యాదవ్ బీజేపీకి చెందిన ఓబీసీ మోర్చాలో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ముంగేర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవికి ఆయన భార్య ప్రీతి కుమారి గట్టి పోటీదారుగా ఉన్నారు. గత కొన్ని నెలలుగా, అరుణ్ తన భార్యతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలను కలుస్తూ తన భార్యను మేయర్ గా నిలబెడుతూ ఉన్నట్లు ప్రజలకు తెలియజేస్తున్నాడు.
బీజేపీ నేత తండ్రి ఫులేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ, అరుణ్ యాదవ్‌కు బెగుసరాయ్ జిల్లాకు చెందిన ప్రీతి కుమారితో 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారిద్దరికీ పిల్లలు లేరు. పాట్నాలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఘటన జరగడానికి వారం రోజుల ముందు భార్యాభర్తలు చికిత్స నిమిత్తం పాట్నా వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్లీ ప్రజలను కలవడం ప్రారంభించాలనుకున్నాడు అరుణ్ యాదవ్. కానీ అలసట కారణంగా వెళ్లలేనని ప్రీతి చెప్పింది. ఆ తర్వాత మూడో రోజు అరుణ్ భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విచారణ కొనసాగుతోంది.