విషాదం : ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్

Online game took 11-year-old innocent's life. ఆన్‌లైన్ గేమ్ వ్యసనం 11 ఏళ్ల బాలుడి ప్రాణాలను తీసింది. వివ‌రాళ్లోకెళితే..

By Medi Samrat  Published on  14 Jan 2022 5:48 AM GMT
విషాదం : ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్

ఆన్‌లైన్ గేమ్ వ్యసనం 11 ఏళ్ల బాలుడి ప్రాణాలను తీసింది. వివ‌రాళ్లోకెళితే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం బజారియా ప్రాంతంలోని శంకరాచార్య నగర్‌లో నివసిస్తున్న 5వ తరగతి విద్యార్థి సూర్యంష్ ఓజా బుధవారం ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 11 ఏళ్ల బాలుడు గత కొన్ని రోజులుగా తన మామ కొడుకుతో కలిసి ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం తన మామ కొడుకుతో కలిసి సూర్యంష్ ఓజా గేమ్‌ ఆడుతున్నాడు. ఆట మ‌ధ్య‌లో పని నిమిత్తం మామ కొడుకు కింది అంతస్తుకు వెళ్లగా.. సూర్యాంశ్ ఇంటి పైకప్పుపైకి ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆన్‌లైన్ గేమ్స్‌ ఆడుతున్నారని విచారణలో తేలిందని బజారియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఉమేష్ యాదవ్ తెలిపారు. తండ్రి యోగేష్ ఓజాకు బగసవానియా ప్రాంతంలో గాజుల దుకాణం ఉంది. ఉమ్మ‌డి కుటుంబంతో కలిసి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు చ‌నిపోవ‌డంతో యోగేష్ ఓజా కుటుంబంలో తీవ్ర విషాదం నెల‌కొంది. ఫ్రీ ఫైర్ అనేది సర్వైవల్ షూటర్ లేదా బ్యాటిల్ గేమ్. ప‌బ్జీ తర్వాత ఫ్రీ ఫైర్ మొబైల్ గేమ్ గా మార్కెట్‌లోకి వచ్చింది. ఈ గేమ్‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. 500 మిలియన్ల‌కు పైగా డౌన్‌లోడ్స్‌ చేయబడింది.


Next Story