హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ శివారులో గల ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని కారు ఢీ కొట్టింది. మంగళవారం తెల్లవారుజామున హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. కాగా క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ నుండి గచ్చిబౌలికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని, కారు నుజ్జు నుజ్జు అయ్యిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో మొత్తం ఆరుగురు యువకులు ప్రయాణిస్తున్నారు.
మద్యం సేవించి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కారులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మితిమీరిన వేగం, మద్యం మత్తులో కారును నడపడంతోనే ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా కారు ముందు సీటులో ఓ యువతి ఇరుక్కుపోయింది. కాగా చాలా కష్టం మీద యువతిని ఓఆర్‌ఆర్ సిబ్బంది బయటకు తీశారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ AP 13N 5121. కారులో ఐదుగురు యువకులు, ఓ అమ్మాయి ఉంది. కారు డ్రైవర్ ప్రేమ్, అందులో ప్రయాణిస్తున్న వారిని కాశీనాథ్, గగన్, గోశాల్, అమిత్ కుమార్, వైశ్వవిగా పోలీసులు గుర్తించారు.