కర్ణాటకలోని శ్రీ గురు తిప్పేస్వామి ఆలయంలోని రెసిడెన్షియల్ వేద పాఠశాలలో ఒక సంస్కృత ఉపాధ్యాయుడు ఫోన్ వాడినందుకు ఒక విద్యార్థిని కొట్టడం, కాళ్లతో తన్నుతున్న వీడియో వైరల్ అయింది. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్లిప్‌లో వీరేష్ హిరేమత్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థిని చితక్కొట్టాడు. బాలుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి ఫోన్ తీసుకున్న తర్వాత ఆ బాలుడిని కొట్టాడని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి చేతికి గాయమైనప్పటికీ, ఉపాధ్యాయుడు అతన్ని కొడుతూనే ఉన్నాడు.
ఆలయ కార్యనిర్వాహక అధికారి గంగాధర్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాయకనహట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన కొద్దిసేపటికే నిందితుడైన ఉపాధ్యాయుడు కనిపించకుండా పోయాడు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారని అధికారులు తెలిపారు. తహసీల్దార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొంతమంది తల్లిదండ్రులు పాఠశాల సమీపంలో నిరసన తెలిపారు. ఆ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు.