వృద్ధురాలి దారుణ హత్య.. బంగారం కోసం..
Old Woman Murdered In Vijayawada. విజయవాడ నగర శివారు కుందావారి కండ్రికలో వృద్ధురాలి హత్య తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 27 Aug 2021 9:04 AM ISTవిజయవాడ నగర శివారు కుందావారి కండ్రికలో వృద్ధురాలి హత్య తీవ్ర కలకలం రేపింది. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంట్లోకి బైక్‌పై వచ్చిన దుండగుడు వృద్ధురాలి మెడలోని బంగారు చైన్‌ను లాక్కునేందుకు యత్నించాడు. దుండగుడితో వృద్ధురాలు ప్రతిఘటించడంతో తలపై రాడ్డుతో దాడి చేశాడు. దీంతో వృద్ధురాలు మంచంలో కుప్పకులిపోయింది. తీవ్ర రక్తం స్రావంతో అచేతనంగా అక్కడే పడిపోయి ఉంది. సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో వృద్ధురాలి ఇంట్లోని పక్క పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న వారు.. వృద్ధురాలిని రక్తపు మడుగులో గుర్తించారు. స్థానికుల సాయంతో వృద్ధురాలిని విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది.
కుందవారికండ్రిక గ్రామంలోని ప్రధాన వీధిలో జనసంచారం ఉండే ప్రాంతంలో ఈ ఘాతుకం జరగటంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీసీఎస్, క్లూస్ టీం బృందాలు నిందితుని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలు మున్నంగి సుబ్బమ్మగా (75) పోలీసులు గుర్తించారు. కుంద్రవారికండ్రిక ప్రాంతంలో గంజాయి బ్యాచ్ సభ్యులు వెకిలి చేష్టలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు తెలిపారు. ఈ ఉదంతంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.