భార్యను చంపి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి ఒక పిస్టల్, లైవ్ కాట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నోయిడా అదనపు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ADCP) అశుతోష్ ద్వివేది మాట్లాడుతూ, నిందితుడు సూరజ్ ను పట్టుకుంటే రూ. 20,000 పారితోషికం ఇస్తామని గతంలో ప్రకటించామని చెప్పారు. గొడవల కారణంగా సూరజ్ భార్యను హత్య చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. సూరజ్ ను పట్టుకోడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. తప్పించుకుంటూ తిరుగుతున్న అతడు ఇటీవల పోలీసుల కంటబడ్డాడు. సరెండర్ అవ్వమంటే అవ్వకపోగా.. పోలీసులను తన దగ్గర ఉన్న తుపాకీతో బెదిరించాడు. దీంతో సూరజ్ కాలుపై కాల్పులు జరిపి.. ఆ తర్వాత అతడిని అరెస్టు చేసినట్లు ద్వివేది తెలిపారు. అతని వద్ద నుంచి నంబర్ ప్లేట్ లేని స్కూటీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
-గొడవల కారణంగా నిందితుడు తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని లోపల గదిలో పడేసి తాళం వేసినట్లు పోలీసులు గమనించారు. సూరజ్ తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతని భార్య క్యారెక్టర్ పై తనకు అనుమానం ఉండేదని.. మేము రోజూ గొడవ పడేవాళ్ళమని సూరజ్ చెప్పుకొచ్చాడు. వంటగదిలోని పాన్ తీసుకుని ఆమె తలపై చాలాసార్లు కొట్టాను, దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను నా చేతులతో గొంతు నులిమి చంపేసాను.. ఆ తర్వాత గదికి తాళం వేసి పారిపోయానని సూరజ్ ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు.