పుట్టింటిని వదిలి అత్తింటికి వెళ్లాలన్న బెంగ.. నవ వధువు ఆత్మహత్య.!

Newly married woman suicide. అనంతపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వివాహం జరిగి నెల రోజులు కూడా కాకుండానే కాళ్ల పారాణిపై కన్నీటి చుక్క రాలిపోయింది.

By అంజి  Published on  1 Dec 2021 3:53 AM GMT
పుట్టింటిని వదిలి అత్తింటికి వెళ్లాలన్న బెంగ.. నవ వధువు ఆత్మహత్య.!

అనంతపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వివాహం జరిగి నెల రోజులు కూడా కాకుండానే కాళ్ల పారాణిపై కన్నీటి చుక్క రాలిపోయింది. తల్లిదండ్రుల ఆశలు, తోబుట్టువుల ఆనందం ఒక్కసారిగా మాయమైంది. తన పుట్టినిల్లును వదిలి అత్త వారింటికి వెళ్లాలన్న బెంగతో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. అనంతపురంలోని బాళ్లారి రోడ్డులో ఈ ఘటన జరిగింది. అనంతపురంకు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ సూర్యనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు సుజన (26) బీటెక్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత 2019 సంవత్సరంలో గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ జాబ్ సాధించి.. బుక్కరాయసముద్రంలోని గ్రామ సచివాలయం-2లో ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలోనే హెడ్‌కానిస్టేబుల్‌ సూర్యనారాయణ తన పెద్ద కూతురికి వివాహం చేయడానికి పెళ్లి సంబంధాలు చూశాడు.

ఆ తర్వాత చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన నరసింహులు కుమారుడు విశ్వనాథ్‌తో పెళ్లి కుదిరింది. గత నెల 17న సుజన, విశ్వనాథ్‌కు పెళ్లి జరిగింది. ఆ తర్వాత సుజన 10 రోజుల పాటు సెలవు పెట్టి తన పుట్టింట్లో ఉంది. సోమవారం నాడు ఉద్యోగానికి వెళ్లిన సుజన.. సాయంత్రం ఇంటికి వచ్చి స్నానాల గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే గత వారం రోజులగా సుజన అత్తింటికి వెళ్లేందుకు ప్రయాణం వాయిదా వేస్తూ వచ్చింది. చాలా సార్లు అత్తింటికి వెళ్లాలని తల్లిదండ్రులు సుజనకు సర్ది చెప్పారు. ఎక్కడ తల్లిదండ్రులను వదిలి వెళ్లాల్సి వస్తుందన్న బెంగతో సోమవారం రాత్రి సుజన ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story