పెళ్లైన రెండు నెలలకే కరెంట్ షాక్‌తో నవ వధువు మృతి.. అసలు నిజం ఏంటంటే..?
Newly Married Woman Murdered By Husband. కేరళలో దారుణం జరిగింది. వివాహాం అయిన రెండు నెలలకే భార్యకు కరెంట్
By Medi Samrat Published on 28 Dec 2020 2:43 PM IST
కేరళలో దారుణం జరిగింది. వివాహాం అయిన రెండు నెలలకే భార్యకు కరెంట్ షాకిచ్చి హత్య చేశాడో యువకుడు. అనంతరం ఏమీ తెలియనట్లు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తన భార్యకు కరెంట్ షాక్ కొట్టిందని.. వెంటనే చూడాలని డాక్టర్లను కోరాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు.. అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పారు. అయితే.. ఆమె ఎవరని అడగగా.. తన భార్య అని చెప్పాడా యువకుడు. ఆ యువకుడి వ్యవహార శైలిపై అనుమానం రావడంతో వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం చెప్పాడు. తన కంటే వయసుల్లో పెద్దదైన మహిళను పెళ్లిచేసుకున్న ఆ యువకుడు తమ పెళ్లి ఫోటోలు బంధువులకు షేర్ చేసిందని హత్య చేసినట్లు చెప్పాడు.
వివరాల్లోకి వెళితే.. కేరళలోని కరక్కోణంలోని ఓ ఆస్పత్రిలో ఎలక్ట్రీషన్‌గా పనిచేస్తుంటాడు అరుణ్‌కుమార్(28). తన తల్లి స్నేహితురాలైన శాఖాకుమారి (51)తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఇద్దరి మధ్యా 23ఏళ్ల తేడా ఉన్నప్పటికి పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు. అక్టోబర్ 19న అతి కొద్దిమంది సమక్షంలో ఆమె మెడలో తాళి కట్టాడు.
ఎందుకంటే.. శాఖాకుమారి ది సంపన్న కుటుంబం. ఆమెకు త్రెస్యాపురంలో ఎకరాల కొద్దీ భూమి ఉంది. బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్లు ఉన్నాయి. పైగా ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం. నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం వస్తుంది. పైగా ఒంటరి మహిళ కావడంతో.. ఆమెను చేసుకుంటే ఆస్తి అంతా తనకు దక్కుతుందని అరుణ్‌కుమార్ ఉద్దేశం.
కాగా.. వివాహం తర్వాత శాఖా కుమారి సంతోషం రెట్టింపైంది. అరుణ్ ఉద్యోగ నిమిత్తం ఇంట్లోంచి వెళ్లగానే కుమారి తన బంధువులు, కావాల్సిన వాళ్లకు ఫోన్ చేసి తన పెళ్లి గురించి చెప్పుకునేది. పెళ్లి ఫోటోలను పంపించేది. కుమారి అలా చేయడం అరుణ్‌కు కోపం తెప్పించింది. ఎందుకంటే అరుణ్ ఆమెను పెళ్లి చేసుకున్న విషయం బయటి ప్రపంచానికి తెలియడం అతడికి అస్సలు ఇష్టం లేదు. ఆమెను పెళ్లి చేసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందిగా. అది బయటపెట్టలేడు. కుమారితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో డిసెంబర్ 26 శనివారం నాడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పట్టలేని కోపంతో అరుణ్.. ఆమెకు విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేశాడు.
అనంతరం.. తన భార్యకు షాక్ కొట్టి పడిపోయిందని చికిత్స చేయాలని వైద్యులను కోరాడు. అప్పటికే ఆమె మరణించటంతో డాక్టర్లు ఎలా చనిపోయిందని అడిగారు. ఇంట్లో డెకరేషన్ లైట్లు అమరుస్తుంటే షాక్ కొట్టి అపస్మారక స్ధితిలోకి వెళ్లిందని చెప్పాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు శాఖా కుమారికి ముఖం, చేతులు, తల భాగంలో కరెంట్ షాక్ కొట్టినట్లు గుర్తించారు. అరుణ్ కుమార్ చెప్పే మాటలపై నమ్మకం కుదరని వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి తమదైన శైలిలో విచారించే సరికి అసలు నిజం బయటపెట్టాడు.