లెహంగాల్లో డ్రగ్స్.. ఫ్రమ్ అడ్రస్ ఏపీలోని నర్సాపురం.. నిజమేమిటంటే..

NCB Now Recovers Drugs Worth Crores. దేశంలో డ్రగ్స్ కు సంబంధించి సంచలన వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  23 Oct 2021 1:08 PM GMT
లెహంగాల్లో డ్రగ్స్.. ఫ్రమ్ అడ్రస్ ఏపీలోని నర్సాపురం.. నిజమేమిటంటే..

దేశంలో డ్రగ్స్ కు సంబంధించి సంచలన వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. రోజుకో డ్రగ్స్ దందా గుట్టు బయటకు వస్తూ ఉంది. స్మగ్లర్లు డ్రగ్స్ ను తరలించడానికి ఎన్నో మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎలెక్ట్రానిక్ పరికరాలు, మరెన్నో వస్తువులలో డ్రగ్స్ ను తరలిస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. ఇప్పుడు లెహంగాలలో కూడా డ్రగ్స్ ను తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. బెంగుళూరులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు పక్కా సమాచారం ఆధారంగా కోట్ల విలువైన సుమారు 3 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు పంపాల్సిన సరుకును మూడు లెహంగాల్లో దాచి ఉంచినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

బెంగళూరు జోనల్ డైరెక్టర్ అమిత్ గావఠే టీమ్ అక్టోబర్ 21న అనుమానస్పదంగా ఉన్న పార్శిల్స్ చెక్ చేయగా డ్రగ్స్ దొరికినట్లు వివరించారు. ఆ పార్శిల్‌పై ఫ్రమ్ అడ్రస్ ఏపీలోని నర్సాపురం అని ఉంది. పార్శిల్ వచ్చింది మాత్రం చెన్నై నుంచి అని అధికారులు విచారణలో గుర్తించారు. ఈ వివరాలను చెన్నైలోని ఎన్‌సీబీ బృందానికి పంపించారు. వారు రెండు రోజుల పాటు దర్యాప్తు చేసి, పార్శిల్ పంపిన వ్యక్తి అసలు వివరాలు గుర్తించి శుక్రవారం పట్టుకున్నారు. పార్సిల్ పంపడానికి నకిలీ చిరునామాలు, ఫేక్ డాక్యుమెంట్లు వినియోగించినట్లు తెలిపారు. ఇప్పటికే దేశంలో ఈ డ్రగ్స్ కు సంబంధించిన దందా ఎక్కువైందని అనుకుంటూ ఉండగా.. ఇలా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.


Next Story