పట్టపగలు కాంగ్రెస్ నేత‌ హత్య.. వారే అయ్యుంటార‌ని అనుమానం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో పట్టపగలు కాంగ్రెస్‌ నేత హత్యకు గురైన ఘటన వెలుగు చూసింది

By Medi Samrat  Published on  19 Oct 2024 2:03 PM GMT
పట్టపగలు కాంగ్రెస్ నేత‌ హత్య.. వారే అయ్యుంటార‌ని అనుమానం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో పట్టపగలు కాంగ్రెస్‌ నేత హత్యకు గురైన ఘటన వెలుగు చూసింది. బీజాపూర్‌లోని ఉసూర్‌లో శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్‌ తిరుపతి భండారి హత్యకు గురయ్యారు.

హత్యకు గురైనప్పుడు ఆయ‌న‌ రేషన్ దుకాణంలో ఉన్నాడు. గతంలో కూడా నక్సలైట్లు చంపేస్తామని బెదిరించడంతో అతని హత్యపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తిరుపతి భండారి ఉసూరు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అతని హత్యతో ఉసూరులో భయాందోళన వాతావరణం నెలకొంది.

నక్సలైట్ల బెదిరింపుల కారణంగా ఆయ‌న‌ తన గ్రామాన్ని వదిలి బీజాపూర్‌లో నివసించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భండారి మరుద్బాక గ్రామ నివాసి. సమాచారం అందుకున్న ఉసూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తిరుపతి భండారీని పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు నిర్ధారణ అయిందని బీజాపూర్ ఎస్పీ కార్యాలయం తెలిపింది. అయితే ఈ ఘటన వెనుక అసలు కారణం ఇంకా నిర్థారణ కాలేదు.

ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు, అయితే దీని వెనుక నక్సలైట్ల హస్తం ఉండే అవకాశాలను తోసిపుచ్చలేదు. హత్య తర్వాత ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ ఘటనను స్థానిక నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తూ భద్రత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నాయకులను నక్సలైట్లు టార్గెట్ చేయడం కొత్తేమీ కాదు. బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలతో కూడిన నక్సల్స్ ప్రభావిత బస్తర్ డివిజన్‌లో వేర్వేరు సంఘటనలలో నక్సలైట్లు జనవరి 2023, ఏప్రిల్ 2024 మధ్య తొమ్మిది మంది బీజేపీ నాయకులను చంపారు. ప్రస్తుతం పోలీసులు ఇతర కోణాల్లోనూ విచారణ జరుపుతూ.. కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Next Story