Hyderabad : పిల్ల‌ల ముందే భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త

హైదరాబాద్‌లో దారుణ ఘ‌ట‌న వెలుగుచూసింది. ఓ భర్త తన పిల్లల ముందే భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు.

By -  Medi Samrat
Published on : 26 Dec 2025 1:35 PM IST

Hyderabad : పిల్ల‌ల ముందే భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త

హైదరాబాద్‌లో దారుణ ఘ‌ట‌న వెలుగుచూసింది. ఓ భర్త తన పిల్లల ముందే భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. ఆ సమయంలో కుమార్తె తన తల్లిని రక్షించడానికి ప్ర‌య‌త్నించ‌గా ఆమెను కూడా మంటల్లోకి నెట్టేశాడు. ఈ క్రమంలోనే భార్య కాలిన గాయాలతో మృతి చెందగా, కుమార్తె స్వల్ప గాయాలతో తృటిలో ప్రాణాల‌తో బయటపడింది.

ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని నల్లకుంట ప్రాంతంలో 24వ తేదీన‌ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న‌ల్గొండ‌కు చెందిన‌ వెంకటేష్, త్రివేణి ప్రేమ వివాహం చేసుకున్నారు. వెంకటేష్‌కు తన భార్య త్రివేణిపై అనుమానం ఉంది. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్యపై అనుమానంతో వెంకటేష్ త‌రుచూ ఆమెను వేధిస్తూ ఉండేవాడు.

డిసెంబర్ 24న త్రివేణిపై పిల్లల ముందే వెంకటేష్ దాడి చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సమయంలో ఆమె కుమార్తె తన తల్లిని రక్షించడానికి ప్రయత్నించగా, ఆమెను కూడా మంటల్లోకి నెట్టాడు.

ఘటనకు పాల్పడిన తర్వాత నిందితుడు భర్త ఇంటి నుంచి పారిపోయాడు. అరుపులు విని ఇరుగుపొరుగు వారు ఇంటికి పరుగులు తీశారు. అయితే.. అప్పటికే త్రివేణి తీవ్రంగా కాలిన గాయాలతో మృతి చెందింది. అతని కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య అనంతరం పరారైన వెంకటేష్‌ను 12 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story