జైలు నుండి పారిపోయిన వ్యక్తిని పట్టుకోడానికి హౌస్ ఓనర్లుగా నటించిన పోలీసులు
Mumbai policemen pose as houseowners to nab absconding undertrial. పెరోల్‌పై జైలు నుండి బయటకు వచ్చి.. తిరిగి వెళ్లకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న వ్యక్
By Medi Samrat
పెరోల్‌పై జైలు నుండి బయటకు వచ్చి.. తిరిగి వెళ్లకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న వ్యక్తి కోసం పోలీసులు పెద్ద ప్లాన్ వేశారు. పెయింటర్‌గా పనిచేస్తున్న ఒక హత్య కేసులో నిందితుడిని పట్టుకోవడానికి, కస్తూర్బా మార్గ్ ముంబై పోలీసు అధికారులు ఏకంగా ఇంటి ఓనర్లుగా మారి.. ఇంటికి పెయింట్ కొట్టించాలని చెప్పుకుంటూ తిరిగారు. ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన నిందితుడు ఇంటి యజమానుల్లా నటిస్తున్న పోలీసులకు దొరికిపోయాడు. మూడేళ్లుగా తప్పించుకుంటూ తిరుగుతున్న 25 ఏళ్ల నిందితుడు బాదల్ వర్మ పాల్ఘర్ ప్రాంతంలో పోలీసులకు దొరికాడు. అతను ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
2017లో బోరివ్లీ ఈస్ట్‌లో ఓ గొడవలో స్నేహితుడి హత్య జరిగింది. ఈ కేసులో వర్మ, అతని సహచరుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వర్మను థానేలోని జైలులో ఉంచారు. 2020లో జైలులో ఉన్న రద్దీని తగ్గించడానికి, కొంతమంది ఖైదీలను పెరోల్ పై విడుదల చేశారు. ఆ లిస్టులో బయటకు వచ్చిన వర్మ ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. మళ్లీ జైలుకు వెళ్లే సమయానికి వర్మ ఎక్కడా కనిపించలేదు. వర్మపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పోలీసులు అతని పూర్వ చిరునామాకు వెళ్లారు. అయితే అతను అక్కడ నివసించడం లేదు.
హెరాయిన్ బానిసగా మారాడు.. వీధుల్లో జీవిస్తూ వచ్చాడు. వర్మ పాల్ఘర్‌కు మకాం మార్చాడని, సోదరుడి సహాయం ద్వారా పెయింటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు అధికారులు తెలుసుకున్నారు. వారు అతని ఫోన్ నంబర్‌ను తీసుకున్నారు. మా కొత్త ఇంటికి పెయింట్ చేయడానికి పెయింటర్ కోసం వెతుకుతున్నట్లు.. పాల్ఘర్ లో తమకు సొంత ఇల్లు ఉందంటూ ఇంటి యజమానుల వలె నటిస్తూ అతనికి కాల్ చేశారు. తాము చెప్పిన అడ్రెస్ కు రావాలని.. లేదా మేమే వచ్చి తీసుకుని వెళ్తామని పోలీసులు చెప్పారు. అప్పుడు వర్మ ఓ ఇంటి అడ్రెస్ ఇచ్చాడు. ఇద్దరు అధికారులు పాల్ఘర్‌కు వెళ్లి, అతని నివాసాన్ని కనుగొని వేచి ఉన్నారు. కొద్దిసేపటికి వర్మ అక్కడకు చేరుకున్నాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కు నెట్టారు.