మీ కుమార్తెను ఉక్రెయిన్ నుండి తీసుకుని వస్తానని చెప్పి.. మోసం

MP Woman Duped by Man Who Promised to Help Bring Back Her Daughter from Ukraine. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే..! దీంతో సాధారణ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు

By Medi Samrat  Published on  27 Feb 2022 7:36 AM GMT
మీ కుమార్తెను ఉక్రెయిన్ నుండి తీసుకుని వస్తానని చెప్పి.. మోసం

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే..! దీంతో సాధారణ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆ దేశంలో భారత్ కు చెందిన వారు కూడా ఇరుక్కుపోయారు.మెడిసిన్ చదవడానికి అక్కడికి వెళ్ళిన భారతీయ విద్యార్థులు దేశంలో చిక్కుకుపోయారు. ఆత్రుతగా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం కూడా అక్కడి భారతీయ విద్యార్థులతో టచ్ లో ఉంది. వారిని తీసుకుని రావడానికి చాలానే ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఇక్కడ ఉన్న భారతీయ పేరెంట్స్ ను కొందరు మోసం చేస్తూ వస్తున్నారు. మీ పిల్లలను క్షేమంగా తీసుకుని వస్తామని చెప్పి డబ్బులు కూడా గుంజుతున్నారు. స్కామర్‌లు ఏ మాత్రం సిగ్గు లేకుండా సంక్షోభాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న మీ పిల్లలకు సహాయం చేస్తామనే సాకుతో భారతీయ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. అటువంటి సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటు చేసుకుంది. అక్కడ PMO సిబ్బందిగా నటిస్తూ ఒక మోసగాడు ఒక తల్లిని రూ. 37,000 మోసం చేశాడని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తల్లి వైశాలి విల్సన్ కుమార్తె ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయింది. ఆమె తన కుమార్తెని తిరిగి తీసుకురావాలని కోరుతోంది. వైశాలి కుమార్తె సృష్టిని ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. సహాయం కోరుతూ జాతీయ, రాష్ట్ర అధికారులను సంప్రదించింది. ఒక మోసగాడు వైశాలిని సంప్రదించాడు.

న్యూ ఢిల్లీలోని PMOలో "వ్యక్తిగత సహాయకుడు" అని చెప్పుకుంటూ, వైశాలికి ఫోన్ చేసి తనను తాను ప్రిన్స్‌ అని చెప్పుకొచ్చాడు. అతను ఉక్రెయిన్ నుండి మీ కుమార్తెకు విమాన టికెట్ ఏర్పాటు చేస్తాననే నెపంతో రూ. 42,000 బ్యాంకు ఖాతాలో వేయాలని వైశాలిని కోరాడు. వైశాలి ఆ మొత్తాన్ని బదిలీ చేసే ముందు పెద్దగా ఆలోచించలేదు. ఆ తర్వాత సదరు వ్యక్తి తన కాల్‌లకు స్పందించకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. "నేను అతని నంబర్‌కు అతనికి చాలాసార్లు కాల్ చేసాను, కానీ ఎటువంటి స్పందన లేదు" అని వైశాలి వార్తా సంస్థతో చెప్పారు. అతడు ఆమె బ్యాంక్ ఖాతాకు రూ. 5,000 తిరిగి ఇచ్చాడని కూడా చెప్పింది. మరిన్ని లావాదేవీలను చూపించే నకిలీ రశీదు పంపాడని ఆమె తెలిపింది.

ఈ సంఘటన తరువాత వైశాలి అధికారులను సంప్రదించారు, PMO లో అలాంటి వ్యక్తి ఎవరూ లేరని చెప్పారు. తాను మోసపోయానని గ్రహించిన వైశాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని ఆ మోసగాడిని పోలీసులు పట్టుకున్నారు. విదిశా ఎస్పీ మోనికా శుక్లా ప్రకారం, నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అతనిని పట్టుకోవడానికి బృందాలను పంపారు. ప్రిన్స్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశామని, తదుపరి విచారణ పురోగతిలో ఉందని ఆమె పేర్కొంది. ఈ విషయం తెరపైకి రావడంతో, రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రభురామ్ చౌదరి, వైద్య విద్య మంత్రి విశ్వాస్ సారంగ్ వైశాలి కుమార్తెను ఉక్రెయిన్ నుండి సురక్షితంగా తిరిగి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.


Next Story