ఐదుగురు కన్న బిడ్డలను దారుణంగా హతమార్చిన తల్లికి కోర్టు జీవిత కారగార శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే... జర్మనీలోని సోలింగెన్ ఏరియాకు చెందిన 28 ఏళ్ల క్రిస్టియానె.కె తన భర్తతో విడిపోయింది. క్రిస్టియానెకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే దూరమైన భర్త వేరే మహిళతో కలిసి ఉన్న ఫొటో చూసిన క్రిస్టియానె కోపంతో ఊగిపోయింది. ఆ ఆవేశంలో తన ఒక సంవత్సరం, రెండు, మూడు ఏళ్ల వయస్సును ముగ్గురు కుమార్తెలు, 6, 8 ఏళ్ల వయస్సుకున్న ఇద్దరు కుమారులను కర్కశంగా హత్య చేసింది. మృతదేహాలను ఒక క్లాత్‌తో చుట్టి బెడ్‌పై పెట్టింది. అదే సమయంలో మరో కుమారుడు స్కూల్‌లో ఉన్నాడు. దీంతో అతడి ప్రాణాలు దక్కాయి.
కన్న బిడ్డల్ని చంపిన తర్వాత క్రిస్టియానె రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయింది. అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగింది. పిల్లల్ని చంపే ముందు వారికి మత్తు మందు ఇచ్చి, ఆ తర్వాత హత్య చేసింది కోర్టులో లాయర్లు తమ వాదనలు వినిపించారు. అయితే తాను నిర్దోషినని క్రిస్టియానె కోర్టుకు తెలిపింది. ఇంట్లోకి ఓ దుండగుడు వచ్చి తన బిడ్డల్ని హత్య చేశాడని చెప్పింది. అయితే విచారణలో మాత్రం ఆమె చెప్పినవన్నీ అబద్దాలు అని తేలింది. దీంతో కోర్టు ఆమెకు జీవిత ఖైదుతో పాటు 15 ఏళ్ల పాటు పెరోల్‌కు అనర్హురాలిగా తీర్పు చెప్పింది.