స్పెయిన్ లో వై-ఫై కనెక్షన్ కట్ చేసిందన్న కోపంతో 15 ఏళ్ల బాలుడు తన తల్లి, తండ్రి, తమ్ముడిని కాల్చి చంపాడు. అతను మూడు రోజుల పాటు వారి మృతదేహాలతో ఇంట్లోనే ఉన్నాడు. నిందితుడైన మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పెయిన్‌లోని ఎల్ష్ నగరంలో ఈ ట్రిపుల్ మర్డర్ చేసిన మైనర్ తన నేరాన్ని అంగీకరించాడు. స్పానిష్ మీడియా ప్రకారం.. పాఠశాలలో తక్కువ మార్కులు తెచ్చుకున్నందుకు, ఇంటి పనులలో సహాయం చేయనందుకు పిల్లాడి తల్లి Wi-Fi కనెక్షన్‌ను తీసివేసింది. దీంతో ఆగ్రహించిన పిల్లాడు తన తల్లి, తండ్రి, పదేళ్ల సోదరుడిని తుపాకీతో కాల్చి చంపాడు.
మూడు రోజుల పాటు మృతదేహాలతో ఇంట్లోనే కూర్చుని.. ఆ తర్వాత జరిగిన విషయాన్ని బంధువులకు తెలిపాడు. ఎల్ష్ పోలీస్ స్టేషన్‌లో తన నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం అతను కస్టడీలో ఉన్నాడు. ఈ కేసు బహిర్గతం అయిన తర్వాత ఆ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. పోలీసు అధికారి మాట్లాడుతూ, 'ఈ విషయం దర్యాప్తులో ఉంది. నిందితుడైన మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతను తన నేరాన్ని అంగీకరించాడు. వై-ఫై కనెక్షన్ కట్ చేసినందుకు ఆగ్రహంతో ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడు' అని తెలిపారు.