సెప్టిక్ ట్యాంక్ లో జర్నలిస్ట్ మృతదేహం
జనవరి 1 నుంచి కనిపించకుండా పోయిన స్వతంత్ర జర్నలిస్టు శవమై కనిపించాడు.
By Medi Samrat Published on 4 Jan 2025 10:17 AM ISTజనవరి 1 నుంచి కనిపించకుండా పోయిన స్వతంత్ర జర్నలిస్టు శవమై కనిపించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లోని చట్టన్‌పరా బస్తీలో సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం లభ్యమైంది. ఎన్‌డిటివిలో కాంట్రిబ్యూటింగ్ రిపోర్టర్‌గా పనిచేసిన ముఖేష్ చంద్రకర్ మరణంపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాంక్రీట్‌తో మూసివేసిన సెప్టిక్ ట్యాంక్‌లో ముఖేష్ మృతదేహాన్ని కనుగొన్నట్లు బీజాపూర్ పోలీసులు ధృవీకరించారు. తల, వీపుపై అనేక గాయాలు ఉన్నాయని గుర్తించారు. పోలీసులు ముఖేష్ మొబైల్ లొకేషన్ ను కనుక్కోడానికి ప్రయత్నించారు.
ముఖేష్ చంద్రకర్ బస్తర్ జంక్షన్ అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడిపారు. ఈ ఛానల్ కు 1.59 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. బస్తర్ ప్రాంతంలోని పలు సమస్యలపై దృష్టి పెట్టారు. జర్నలిస్టు ముఖేష్, అతని సోదరుడు యుకేష్ చంద్రకర్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. సోదరులు తమ కెరీర్‌లో ఒకరికొకరు మద్దతుగా నిలిచారు. ముఖేష్ ఏప్రిల్ 2021లో మావోయిస్టుల ద్వారా కిడ్నాప్ అయిన CRPF కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను విడుదల చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
జనవరి 1న టీ షర్ట్, షార్ట్ ధరించి తన ఇంటి నుండి బయటకు వచ్చాడు ముఖేష్ చంద్రకర్. కొద్దిసేపటికే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని సోదరుడు యుకేష్ అతని కోసం స్నేహితుల ఇళ్లలో, నగరం అంతటా వెతకడం ప్రారంభించాడు. చివరికి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.