అక్రమంగా మద్యం తీసుకెళ్లేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరికీ అనుమానం రాకుండా వ్యూహరచన చేస్తున్నారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్‌లో కూడా అలాంటిదే జరిగింది. చాక్లెట్ల ముసుగులో కంటైనర్‌లో లక్షల రూపాయల విలువైన అక్రమ మద్యం తరలిస్తున్నారు. పోలీసులు కూడా ఈ ఘటనను చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం చాక్లెట్ బాక్సులను తెరిచి చూడగా.. బాక్సు కింద మద్యం బాటిళ్లు ఉన్నట్టు గుర్తించారు. దేవాస్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాలోని పోలీస్ స్టేషన్‌కు కంటైనర్‌లో అక్రమ మద్యం తరలిస్తున్నట్లు సమాచారం అందింది. పోలీసులు కంటైనర్ నంబర్ UP 21 CN 5270ని అడ్డగించి ప్రశ్నించారు.
డ్రైవర్‌ను పేపర్‌లను బహిర్గతం చేయమని అడగగా, అతను చాక్లెట్ రవాణా బిల్లు గురించి పోలీసులకు చెప్పాడు. ఇన్‌ఫార్మర్ సమాచారంతో పోలీసులు కంటైనర్‌లో సోదాలు చేశారు. పరిశోధనలో చాక్లెట్ బాక్స్ కింద మద్యం బాక్సులను ఉంచినట్లు తేలింది. ఒక్కొక్కటిగా బాక్సులన్నీ దించారు అధికారులు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి మద్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చాక్లెట్ బాక్స్ వెనుక మద్యం బాక్సులను దాచారు. మద్యం ధర రూ.45 లక్షలకు పైమాటే ఉంటుందట. పోలీసులు 482 చాక్లెట్ల బాక్సులను, 950 బాక్సుల మద్యం (10,000 లీటర్లు) సహా కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిద్దరూ యూపీలోని మొరాదాబాద్ జిల్లా వాసులు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కంటెయినర్‌లో మద్యం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నారు.