చనిపోయిన నవజాత శిశువు కేసును కొన్ని గంటల్లోనే ఛేదించారు సూరత్ పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగా గర్భం దాల్చి.. శిశువు జన్మించాక ఆ బాధ్యత తీసుకోవడం ఇష్టం లేక ఆ పాపను మైనర్ తల్లి చంపేసింది. మంగళవారం ఉదయం సూరత్‌లోని మగ్దల్లా ప్రాంత స్థానికులు శిశువును కనుగొన్నారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్, పారామెడికల్ సిబ్బంది పాప చనిపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సీసీటీవీ ఫుటేజీ సహాయంతో పోలీసు బృందం (మహిళా విభాగం) గంటల వ్యవధిలో దర్యాప్తు చేసి హత్య కేసు మిస్టరీని చేధించి పోలీసులు విజయం సాధించారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ బాగ్మార్ మీడియాకు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి మగ్దల్లా ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌పై నుంచి పసికందును తోసేస్తున్న దృశ్యం కెమెరాకు చిక్కింది.
గర్భిణి గురించి పోలీసులు ఇంటింటికీ తిరిగి విచారించగా, మైనర్ బాలిక గర్భవతి అని తెలిసింది. ఆమెను ఒక మహిళా పోలీసు అధికారి ప్రశ్నించగా.. ఉదయాన్నే బిడ్డను ప్రసవించిందని ఆమె అంగీకరించింది. ఆమె శిశువు బాధ్యతను స్వీకరించడానికి ఇష్టపడలేదు.. అందుకే శిశువును దూరంగా విసిరివేసినట్లు తెలిపింది. బాలిక అక్రమ సంబంధం కారణంగా గర్భవతి అయింది. మైనర్ తల్లితో పాటు గర్భానికి కారణమైన యువకుడిపై హత్య కేసు నమోదు చేస్తామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.