రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఆమె వ్యక్తిగత భాగాలలో పదునైన వస్తువులను చొప్పించి, నగరంలోని ఓవర్‌బ్రిడ్జిపై నుండి ఆమెను విసిరినట్లు అధికారులు తెలిపారు. అల్వార్‌లోని తిజారా ఫ్లైఓవర్ కింద బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. మంగళవారం బాధితురాలిని అల్వార్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు ఆమెకు అవుతున్న రక్త స్రావాన్ని ఆపడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం జైపూర్‌లోని జేకే లోన్‌ ఆస్పత్రికి బుధవారం తరలించారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు, బాధితురాలు ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడిందని తెలిపారు.

"వైద్యులు ఆమెకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆమె ఇప్పుడు ప్రమాదం నుండి బయటపడింది" అని రాజస్థాన్ మంత్రి పర్సాది లాల్ మీనా చెప్పారు. మైనర్ బాలిక శరీర భాగాల్లోకి పదునైన వస్తువులు అమర్చారని, దీంతో ఆమె అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. సమాచారం ప్రకారం.. బాలిక అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయి. ఆమె ప్రస్తుతం జేకే లోన్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంది. బాలిక అంతర్గత అవయవాలపై అనేక లోతైన గాయాలు ఉన్నాయి.

బాలిక పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని జైపూర్‌లోని జెకె లోన్ ఆసుపత్రి డాక్టర్ అరవింద్ శుక్లా తెలిపారు. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. 25 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన 300కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించామని, అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని, నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని మంత్రి పర్సాది లాల్ మీనా తెలిపారు.

నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రాజస్థాన్ మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మమతా భూపేష్ హామీ ఇచ్చారు. మమతా భూపేష్ కూడా బాలిక కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం ప్రకటించారు. రూ.6 లక్షలలో రూ.5 లక్షలు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రూ. లక్షను మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించింది. అల్వార్‌లోని బాధిత కుటుంబ సభ్యులకు సామాజిక న్యాయ శాఖ మంత్రి టికారమ్ జూలీ రూ. 3.5 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. బాధితురాలి తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుండగా ఆమెకు సోదరుడు, సోదరి ఉన్నారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story