ఎంచక్కా పారిపోయి బతుకుదామని వాళ్లిద్దరూ స్కెచ్ వేశారు.. కానీ ఓ తప్పు చేశారు..!
గుజరాత్‌లోని కచ్‌లో ఒక వృద్ధుడిని 27 ఏళ్ల వివాహిత, ఆమె ప్రేమికుడు చంపేసి కటకటాల పాలయ్యారు
By Medi Samrat Published on 14 Oct 2024 1:45 PM ISTగుజరాత్‌లోని కచ్‌లో ఒక వృద్ధుడిని 27 ఏళ్ల వివాహిత, ఆమె ప్రేమికుడు చంపేసి కటకటాల పాలయ్యారు. ప్రియురాలు చనిపోయినట్లు ప్రపంచానికి చెప్పే ప్రయత్నంలో ఓ వృద్ధుడిని హత్య చేశారు. వీరిద్దరికీ ఆ వ్యక్తి ఎవరో తెలియదు. కలిసి పారిపోయే క్రమంలో ఆ వృద్ధుడిని హత్య చేశారని అధికారులు తెలిపారు. రామి కేసరియా, అనిల్ గంగల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జంట ఒంటరిగా తిరుగుతున్న వృద్ధుడిని చంపి, ఆపై అతని శరీరాన్ని కాల్చారు. జులైలో అతడిని హత్య చేయగా.. మూడు నెలల తర్వాత ఈ జంటను పట్టుకున్నారు అధికారులు.
రామి, అనిల్ లు వృద్ధుడిని ప్రలోభపెట్టి హత్య చేశారు. రామి చనిపోయిందని నమ్మించడానికి వారు అతడి శరీరాన్ని కాల్చారు. కుటుంబ సభ్యులను తప్పుదారి పట్టించడానికి, వారు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందనే ప్లాన్ వీళ్లది. ఈ జంట స్వేచ్ఛగా తిరగొచ్చని అనుకున్నారు. రామి తన బట్టలు, ఫోన్, పాదరక్షలను వృద్ధుడిని తగలబెట్టిన ప్రాంతంలో వదిలిపెట్టింది. జూలై 3న తమ ప్లాన్ ను అమలు చేసి గ్రామాన్ని విడిచిపెట్టారు. మరుసటి రోజు అనిల్ రామి ఇంట్లో పరిస్థితిని తెలుసుకోడానికి తిరిగి వచ్చాడు. ఘటనా స్థలంలో ఆమె బట్టలు, మొబైల్ ఫోన్ లభ్యం కావడంతో కాలిన మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు.
రెండు నెలల తర్వాత అనిల్, రామి కచ్‌కి తిరిగి వచ్చారు. ఒక గదిని అద్దెకు తీసుకుని ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నించారు. సెప్టెంబర్ 27న తమ నేరాన్ని అంగీకరించి క్షమాపణ కోరేందుకు రామి తండ్రి వద్దకు తిరిగి వచ్చారు. రామి తండ్రి కేసు వివరాలను పోలీసులకు అందించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రామి, అనిల్‌లను అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు.