రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలో పిల్లలను కనలేదనే కారణంతో వివాహితను ఆమె అత్తమామలు హత్య చేశారు. ఖోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాక్రా గ్రామంలో ఈ సంఘటన జరిగింది, అక్కడ ఆ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హత్యను దాచిపెట్టి, ప్రమాదవశాత్తు చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ మహిళ అత్తమామలు ఆమె మృతదేహాన్ని ఇంట్లోని మంటల్లో కాల్చడానికి ప్రయత్నించారు. అగ్నిప్రమాదంలో చనిపోయిందని గ్రామస్తులకు చెప్పారు. అయితే, గ్రామస్తులకు అనుమానం వచ్చి దహన సంస్కారాలు నిర్వహించే ముందు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆ మహిళ అత్తమామలను ఫోన్ ద్వారా సంప్రదించి, అంత్యక్రియలు నిర్వహించవద్దని ఆదేశించారు. అయినప్పటికీ, అత్తమామలు హడావిడిగా మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే, దహన సంస్కారాలు జరగకముందే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీగ్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అత్తమామలు చేసిన తప్పును ఒప్పుకున్నారు.