ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై భారీగా డబ్బు పోగొట్టుకున్న ఆ వ్యక్తి చివరికి ఏటీఎంకు కన్నమేయాలని ఫిక్స్ అయిపోయి అడ్డంగా దొరికిపోయాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మోఘపురా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తిని అలియాబాద్‌కు చెందిన మిఠాయిలు విక్రయించే హోన్మనే కాశీనాథ్ అలియాస్ కాశీ (24)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రమ్మీ, రౌలెట్ వంటి ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన కారణంగా, కాశీ భారీగా అప్పులు చేశాడు. సుమారు రూ. 30 లక్షలకు చేరుకుంది. తన స్నేహితులు, ఆన్‌లైన్ లోన్ యాప్‌ల నుండి డబ్బును తీసుకున్నాడు. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో, అతను ATMని లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడ్డాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఫిబ్రవరి 15న తెల్లవారుజామున శాలిబండలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి ప్రవేశించి బండరాయితో ఏటీఎం మిషన్‌ను తెరిచాడు. అయితే డబ్బులు పెట్టే చెస్ట్ నుండి మాత్రం డబ్బులను తీయలేకపోయాడు. దీంతో అక్కడి నుండి పారిపోయాడు. నగదు తీసుకునేందుకు ఓ ఖాతాదారుడు ఏటీఎం వద్దకు వచ్చి బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. శాలిబండ శాఖలోని ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ సయ్యద్ మహమ్మద్ రఫీ ఫిర్యాదు మేరకు మొగల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి కాశీని అరెస్ట్ చేశారు. దాదాపు రూ. 7.7 లక్షల నగదు చెక్కుచెదరకుండా ఉందని బ్యాంకు అధికారులు నిర్ధారించారు. నగదు దొంగిలించలేదని పోలీసులు తెలిపారు.