5 అంతస్తుల భవనంపై నుంచి.. ఇద్దరు బాలికలను కిందకు విసిరేసిన వ్యక్తి..!

Man throws 2 girls down from 5-storey building in bihar. బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఇద్దరు మైనర్ బాలికలను 5 అంతస్తుల భవనంపై నుంచి కిందకు

By అంజి  Published on  4 Feb 2022 8:16 AM GMT
5 అంతస్తుల భవనంపై నుంచి.. ఇద్దరు బాలికలను కిందకు విసిరేసిన వ్యక్తి..!

బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఇద్దరు మైనర్ బాలికలను 5 అంతస్తుల భవనంపై నుంచి కిందకు తోసేశాడు. ఓ బాలిక మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. సంఘటన తర్వాత, నిందితుడిని తీసుకెళ్తున్న పోలీసులపై గుంపు రాళ్లు రువ్వింది. ఇందులో 5 మంది పోలీసులు గాయపడ్డారు. ఆగ్రహించిన గుంపు పలు వాహనాలను తగులబెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన పాట్నా నగరంలోని బహదూర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక వార్డు కౌన్సిలర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. రామకృష్ణ కాలనీలో మున్నాకు ఇల్లు ఉందన్నారు. పండ్ల వ్యాపారం చేసే నంద్‌లాల్ గుప్తా కుటుంబం ఇక్కడ నివసిస్తోంది. అతనికి షాలు, సలోని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె వయస్సు 10 సంవత్సరాలు, పెద్ద కుమార్తె వయస్సు 12 సంవత్సరాలు.

గురువారం వివేక్ కుమార్ అనే యువకుడు ఇద్దరు బాలికలను ఐదో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. అందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే ఘటన స్థానికులకు ఆగ్రహం తెప్పించి నిందితుడిని పట్టుకున్న పోలీసులపై రాళ్లు రువ్వింది. గుంపు పలు వాహనాలను కూడా తగులబెట్టింది. గుంపు రాళ్లదాడిలో ఎస్‌హెచ్‌ఓ సహా ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డాడో వెల్లడించలేదు. ఘటన జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it