ఆఫ్రికాలోని మొజాంబిక్‌కు చెందిన వ్యక్తి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.02 కిలోల కొకైన్ ను కడుపులో దాచుకుని అడ్డంగా దొరికిపోయాడు. వాటి విలువ 10 కోట్ల రూపాయలు. కొకైన్ ను క్యాప్సూల్స్ రూపంలో తన కడుపులో దాచుకున్నట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మంగళవారం తెలిపింది. అధిక విలువ కలిగిన కొకైన్‌ని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని ఎన్‌సిబి బృందం ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుంది. పట్టుకున్న వ్యక్తిని ఫ్యూమో ఇమాన్యుయేల్ జెడ్‌క్వియాస్ గా గుర్తించారు.
అధికారులు అతడిని విచారించగా 70 కొకైన్ నింపిన క్యాప్సూల్స్ మింగినట్లు కనుగొన్నారు. అతను వైద్య సహాయం కావాలని అధికారులను కోరాడు. వెంటనే అతడిని బైకుల్లాలోని జెజె ఆసుపత్రికి తరలించారు. అతడు మింగినవి పది ప్రయత్నాలలో శరీరం నుండి బయటకు వచ్చాయి. చివరిది మంగళవారం ఉదయం జరిగింది. రికవరీ చేయబడిన మొత్తం కొకైన్ బరువు 1.029 కిలోలు. ఒక మనిషి శరీరం నుండి ఇంత పెద్ద మొత్తంలో కొకైన్ క్యాప్సుల్స్ ను స్వాధీనం చేసుకోవడం ఇదొక రికార్డు అని అధికారులు చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.