మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 22 ఏళ్ల వ్యక్తి రైల్వే ట్రాక్‌పై నిలుచొని వీడియో తీస్తుండగా.. రైలు ఢీకొట్టి మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆదివారం నాడు ఇటార్సి-నాగ్‌పూర్ రైలు మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు పంజర కాలా గ్రామానికి చెందిన సంజు చౌరే (22)గా గుర్తించామని పాత్రోటా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నగేష్ వర్మ తెలిపారు. ట్రైన్ వస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్న ఉత్సాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో శరద్‌దేవ్ బాబా ప్రాంతంలో సంజు చౌరే తన స్నేహితుడితో కలిసి సోషల్ మీడియా ఖాతాలో అప్‌లోడ్ చేసేందుకు వీడియోను చిత్రీకరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అటుగా వచ్చిన రైలు అతణ్ని ఢీ కొట్టింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సంజు చౌరే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి స్నేహితుడు చిత్రీకరించిన వీడియోలో ట్రాక్ పక్కనే నిల్చున్న సంజు చౌరేతో పాటు.. అటుగా వచ్చే గూడ్స్ రైలు హారన్ కొడుతున్న విషయాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.